రెండు ఆవులను చంపిన పులి..భీంగల్ మండలంలో దేవక్కపేటలో ఘటన

రెండు ఆవులను చంపిన పులి..భీంగల్ మండలంలో  దేవక్కపేటలో ఘటన

బాల్కొండ, వెలుగు: మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి వచ్చిన పెద్దపులి నిజామాబాద్ జిల్లాలో భయాందోళన సృష్టిస్తోంది. ఫారెస్ట్ అధికారులకు ఈ పులిని పట్టుకోవడం సవాల్​గా మారింది. భీంగల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన భూక్యా చంద్రు పంట పొలాల్లో ఉంచిన రెండు ఆవులను పెద్దపులి చంపేసింది. బుధవారం రాత్రి రైతు ఆవులను పొలాల్లో ఉంచి వెళ్లగా గురువారం ఉదయం వచ్చి చూసే సరికి రెండు ఆవులు చనిపోయి కనిపించాయి. వాటి శరీరాలపై పులి పంజా గాట్లు పడ్డాయి. సమీపంలో పులి కాలి ముద్రలు కూడా కనిపించడంతో పెద్దపులి చంపినట్లుగా నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఈ పులి నీటి లభ్యత, వన్యప్రాణులు ఉండే ప్రాంతాల్లో మకాం వేసినట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పది రోజుల క్రితం కమ్మర్‌‌పల్లి మండలం గట్టు పొడిచిన వాగు ప్రాంతంలో ట్రాప్ కెమెరాకు పులి కనిపించినప్పటికీ ప్రస్తుతం దాని జాడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు.